- సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర
నమస్తే శేరిలింగంపల్లి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా సగరుల రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శిస్తామని తెలంగాణ సగర సంగం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. గచ్చిబౌలిలోని సగర సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సగర సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీర్మానించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ ధన బలం లేక చట్టసభల్లో అడుగు పెట్టడానికి అవకాశం లేని తమ జాతి భవిష్యత్తు రాజకీయాలను శాసించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పిటిసిలుగా, ఎంపీపీలుగా, జెడ్పి చైర్మన్ లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసి మెజారిటీ స్థానాలలో విజయం సాధించడం కోసం తమ ప్రయత్నం కొనసాగిస్తామని అన్నారు.
వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న సగరులు రాబోయే ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు సగరులకు మెజారిటీ స్థానాలలో అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. సగరులను విస్మరించే ఏ రాజకీయ పార్టీనైనా ఓడించడం కోసం తమ ప్రయత్నం ఉంటుందని, సగరులను గుర్తించి అవకాశాలు కల్పించే ఏ రాజకీయ పార్టీనైనా ఆదరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది సగరులు రాజకీయంగా రాణించేందుకు త్వరలోనే రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వేలాది మందితో ‘సగర చైతన్య సదస్సు’ నిర్వహిస్తామని ప్రకటించారు. సగరులను చైతన్యపరిచే లక్ష్యంతో కాల పరిమితి పూర్తయిన జిల్లాలలో త్వరలోనే తిరిగి నూతన కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత బలోపేతంగా నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, రాష్ట్ర కోశాధికారి వడ్లకొండ కుమారస్వామి సగర, రాష్ట్ర సంఘం ముఖ్య సలహాదారులు ఆర్.బి ఆంజనేయులు సగర, సగర ఆత్మగౌరవ భవన వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ అస్కాని మారుతి సాగర్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు మర్క సురేష్ సగర, ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్ సగర, కోశాధికారి సాయి గణేష్ సగర, రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు గాండ్ల స్రవంతి సగర, ప్రధాన కార్యదర్శి అతినారపు విజయలక్ష్మి సగర, కోశాధికారి సూర జయమ్మ సగర, రాష్ట్ర పాలకమండలి సభ్యులతో పాటు 24 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర యువజన సంఘం, మహిళా సంఘం కమిటీల సభ్యులు హాజరయ్యారు.