- ఐఏఎస్ కు ఎంపికైన 22 ఏండ్ల సాయి ఆశ్రిత్
- పుష్పగుచ్ఛం అందించి అభినందించిన గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: పిన్న వయసులోనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడమంటే ఇదే. వరంగల్ కి చెందిన యువకుడు ఈ ఘనత సాధించాడు. ఏమిటనుకుంటున్నారా.. ! అదే .. మన దేశంలో అత్యున్నత స్థాయి పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్స్ లో మొదటి ప్రయత్నంలోనే 40వ ర్యాంక్ సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ఈ సందర్బంగా వరంగల్ కి చెందిన శాఖమూరి అమరలింగేశ్వర్( అమర్) పద్మజల కుమారుడు సాయి ఆశ్రిత్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శాలవతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ 22 ఏండ్లకే ఐఏఎస్ సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. ఎంతో మందికి కలల ఉద్యోగం అని, దేశములోనే అత్యున్నత స్థాయి ఉద్యోగం అని, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. జీవితంలో గొప్పగా రాణించాలంటే ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని అటువైపుగా అడుగులు వేయాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి ఆశ్రిత్ తండ్రి శాఖమూరి అమరలింగేశ్వర్( అమర్) పాల్గొన్నారు.