నమస్తే శేరిలింగంపల్లి: అన్నమయ్య పురంలో రాజేశ్వరీ శిష్యుల సంకీర్తనలు అలరించాయి. పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు సారధ్యంలో అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి ప్రతి వారం నిర్వహిస్తూ వస్తున్న కార్యక్రమంలో అన్నమాచార్య భావనా వాహిని పూర్వ విద్యార్ధిని శ్రీ మతి కొమ్మూరి రాజేశ్వరి శిష్యులు కలిసి తొలుతగా “శ్రీ మత్ త్వదియ చరితామృత”, గురు ప్రార్థనతో ప్రారంభించి “దేవా నమోదేవా” , “కలిగెను ఇది నాకు కైవల్యము”, “బ్రహ్మ మొక్కటే”, “అలివేలు మంగ”, “ఏమని పొగడదునే” వంటి బహుళ ప్రాచుర్యం పొందిన సంకీర్తనలను కొమ్మూరి రాజేశ్వరి, మర్రిపూడి ప్రభ, బి. విజయలక్ష్మి, పుష్పలత, ఎం హరిప్రియ, గాయత్రి అంజన, బి. విజయ్, కే జ్వస్న ఆలపించారు. వారికి తబలా పై భూమేష్, కీబోర్డ్ పై మారుతి కిరణ్ వాయిద్య సహకారం అందించారు.
డాక్టర్ శోభా రాజు మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలు మంత్రాలు వాటిని నేర్చుకొని తన వంతుగా సంకీర్తనలు అందరికీ నేర్పుతోందని తన శిష్యురాలైన కొమ్మూరి రాజేశ్వరిని అభినందించారు. అనంతరం స్వరార్చన చేసిన కొమ్మూరి రాజేశ్వరి శిష్యులను డాక్టర్ శోభారాజు సాలువ, ఙ్ఞాపికతో సత్కరించారు. అన్నమయ్య సమేత వేంకటేశ్వర స్వామికి మంగళ హారతి, ప్రసాద వితరణతో కార్యక్రమం ముగిసింది.