- నాలుగు రాష్ట్రాల్లో 40చోట్ల.. నగరంలో 25చోట్ల ఏకకాలంలో దాడులు
నమస్తే, శేరిలింగంపల్లి : లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడి స్పీడ్ పెంచింది. శుక్రవారం తెల్లవారు జామునుండి ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి నగరంలోని 25 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో దాదాపు 40 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుండగా.. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 25 చోట్ల సోదాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతపెద్ద మొత్తంలో సోదాలు జరగడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. నిన్న లిక్కర్ స్కామ్ కు సంబంధించి స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోస్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం ఆ స్కామ్ తో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నాయకుల్లో, వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామునుండి రాయదుర్గం లోని జయభేరి విస్టలింగ్ కోర్ట్ సౌత్ బ్లాక్ నివాసం ఉండే అభినయ్ రెడ్డి అనే వ్యాపార వేత్త ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. కేంద్ర భద్రతా బలగాల పహారాలో ఈ సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాయదుర్గంతో పాటు నానక్ రామ్ గూడ రాబిన్ డిస్టిల్లరీస్ కార్యాలయం, దోమల్ గూడలోని శ్రీసాయి అపార్టుమెంట్, నానక్ రాంగూడతో పాటు పలు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.