- ‘మెడికేషన్ వితౌట్ హామ్’ ‘మెడికేషన్ సేఫ్టీ’ అంటూ అవగాహన ర్యాలీ
నమస్తే శేరిలింగంపల్లి : “ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం ” సందర్బంగా ‘ మెడికేషన్ వితౌట్ హామ్’ ‘మెడికేషన్ సేఫ్టీ’ అనే నినాదంతో మెడికవర్ హాస్పిటల్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ ర్యాలీని మెడికవర్ హాస్పిటల్స్ నుంచి హైటెక్స్ వరకు నిర్వహించగా… క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి జెండా ఊపి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రోగి భద్రతకు పాటుపడతామని 100 మంది సిబ్బంది ప్రతిజ్ఞ బూనారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి, వారి జీవితంలో ఏదో ఒక సమయంలో అనారోగ్యానికి గురికావాల్సి వస్తుందని, ఆ అనారోగ్యాన్ని నివారించడానికి లేదా చికిత్స చేయడానికి మందులు తీసుకుంటారని, అప్పుడు మనం వేసుకొనే మందులు తప్పుగా నిల్వ చేయబడినా, సూచించినా, పంపిణీ చేయబడినా, తగినంతగా పర్యవేక్షించకపోయినా కొన్నిసార్లు తీవ్రమైన హానిని కలిగిస్తాయని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలో నివారించదగిన హానికి అసురక్షిత మందుల పద్ధతులు , మందుల లోపాలు ప్రధాన కారణమని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘మెడికేషన్ వితౌట్ హామ్’ నినాదంతో ‘మెడికేషన్ సేఫ్టీ’ని 2022 ప్రపంచ పేషెంట్ సేఫ్టీ డే థీమ్‌గా ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాకేష్ చీఫ్ మెడికల్ సర్వీసెస్ , సెంటర్ హెడ్ డాక్టర్ మాతా ప్రసాద్, డాక్టర్ అనూష- DMS పాల్గొన్నారు