నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా రాష్ట్రంలో ప్రతి మహిళకు ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నారని, ఆగస్టు 15వ తేదీ నుంచి అర్హులైన మరో పది లక్షల మందికి రూ. 2,016 చొప్పున పింఛన్లను ఇచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పూనుకుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, మంజుల రఘునాథ్ రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ సృజన రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఎల్లప్పుడూ సోదరికి అండగా నిలుస్తానని సోదరుడు చేసే ప్రమాణానికి ప్రతీకే రక్షాబంధన్ అని అన్నారు.
పవిత్ర ప్రేమను చాటిచెప్పే రాఖీ పౌర్ణమి అని, ఇది అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ అని అన్నారు. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అన్న అంటే అమ్మలో మొదటి అక్షరం అ , నాన్న లోని రెండో అక్షరం న్న కలిపితే వచ్చే బంధమే అన్న చెల్లెలి అనురాగానికి ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ వరదాచారీ తదితరులు పాల్గొన్నారు.