నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని పార్కును అన్ని విధాల అభివృద్ధి చేసి అందరికి అందుబాటులో ఉండేలా అహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పత్రిక నగర్ లోని పార్క్ లో రూ. కోటి 80 లక్షల అంచనావ్యయంతో చేపట్టిన పార్క్ సుందరీకరణ, అభివృద్ధి పనులను, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పార్క్ ను అన్ని విధాల సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు.వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేయడానికి ఎంతో అనువుగా ఉంటుందన్నారు. హైటెక్ సిటీకి వెనక భాగంలో ఉన్న పత్రిక నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని, ఆ ప్రాధాన్యతలో భాగంగా పత్రిక నగర్ లోని పార్కుల్లో పచ్చని చెట్లు కనిపించాలని, అందుకు పత్రిక నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని కాలుష్యాన్ని రూపుమాపి ఆరోగ్యకర వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయని, పార్కులో పూలు, పండ్లు ఆరోగ్యానికి ఉపయోగపడే మొక్కలు నాటి వాటి పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, టీపీఎస్ రవీందర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, నాయకులు శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్ పాల్గొన్నారు.