నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని, ప్రజలకు అవసరమయ్యే అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. క్యూ మార్ట్ నుండి రోలింగ్ హిల్స్ వరకు రూ. 2 కోట్ల అంచనావ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు, కొత్తగూడ నుండి కొండాపూర్ ప్రధాన రహదారి వరకు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన యూజీడీ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో రాజీపడేది లేదని, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బీటీ రోడ్లు, యూజీడీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడేది లేదన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, టీపీఎస్ రవీందర్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, నాయకులు శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్, జంగం గౌడ్ , శశిధర్ పాల్గొన్నారు.