నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపీనగర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా శ్రేయ హాస్పిటల్ అక్రమ కట్టడాన్ని అడ్డుకోవడంలో జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని టీఆర్ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి దుయ్యబట్టారు. శ్రేయ హాస్పిటల్ అక్రమ కట్టడానికి జీహెచ్ఎంసీ అధికారుల పూర్తి మద్దతు ఉందని ఆరోపించారు. 15 ఫీట్ల రహదారి అనుకొని దాదాపు ఆరు అంతస్థుల అక్రమ నిర్మాణం జరుగుతుందని జీహెచ్ఎంసీ అధికారులకు ప్రజలు ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విడ్డూరమన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు అక్రమ కట్టడాలను నిరోధించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ నిధులకు భారీ ఎత్తున గండి పడుతున్న దృష్ట్యా ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నిద్రావస్థను వీడి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.