నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు వరద ముంపునకు గురికాకుండా జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చందానగర్ డివిజన్ దీప్తిశ్రీ నగర్ లోని నాలా విస్తరణ పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. మియాపూర్ పటేల్ చెరువు నుంచి గంగారం చెరువు వరకు గల నాలా పూడికతీత పనులను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. రాబోయే వర్షాకాలంలో చందానగర్ డివిజన్ పరిధిలో ఏ ఒక్క కాలనీ వరద ముంపునకు గురి కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాలాలో పేరుకుపోయిన పూడిక తొలగించి నాలాల విస్తరణ పనులు పూర్తి చేయాలన్నారు. దీప్తి శ్రీ నగర్ కాలనీ వరద ముంపునకు గురి కాకుండా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చోరవతో కోట్ల రూపాయల వ్యయంతో నాలా ఇరువైపుల చేపట్టిన రిటర్నింగ్ వాల్ నిర్మాణం, సీబీఅర్ ఎస్టేట్ అపార్ట్ మెంట్స్ వెనుక నాలా ఆర్ సీ సీ బాక్స్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, వర్క్ ఇన్ స్పెక్టర్ జగన్ తదితరులు పాల్గొన్నారు.