నమస్తే శేరిలింగంపల్లి: చెరువులను సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తూ సుందరీకరణ పనులను చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని గురునాథం చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులలో భాగంగా ఫెన్సింగ్ ఏర్పాటు పనులను కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గురునాథం చెరువు కబ్జా కాకుండా రక్షణలో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరుగుతుందని అన్నారు.చెరువులను సంరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పారు. గురునాథం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి సుందరీకరణ చేస్తామన్నారు. చెరువును దత్తత తీసుకొని సొంత నిధులతో అభివృద్ధి చేసే దిశగా పాటుపడుతున్నట్లు చెప్పారు.
గురునాథం చెరువు మీదుగా జేపీ నగర్ అవుట్ లెట్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కల్వర్టు వరకు కోటి 15 లక్షల నిధుల వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ నిర్మాణం పనులను పరిశీలించారు. గురునాథం చెరువులో డ్రైనేజీ, కలుషిత నీరు కలవకుండా ఉండేందుకు వీలుగా వరద నీటి కాలువ నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే గాంధీ చెప్పారు. దీంతో చెరువులో కలుషిత నీరు కలవకుండా స్వచ్చమైన వర్షం నీరు మాత్రమే చేరడంతో చెరువులో శుభ్రమైన నీరు నిల్వ ఉంటుందన్నారు. వరద నీటి కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ శివప్రసాద్, వర్క్ ఇన్‌స్పెక్టర్ జగదీష్, నాయకులు కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశీనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.