నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు భాష మీద పట్టు పెంచుకొని ఖండాంతరాల వరకు వ్యాపింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని భేరీ వెంకటమ్మ వెంకటయ్య యాదవ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మిట్ట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను, స్టడీ మెటీరియల్స్ ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ పంపిణీ చేశారు. మాతృ భాష మాధుర్యం, గొప్పతనం గురించి విద్యార్థులకు ఆయన తెలియజేశారు. మాతృభాష తెలుగు నవరస మనోహరమైనదని, సుమధురమైనదని అన్నారు. తెలుగు వ్యాకరణం లోని అంశాలు సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, పద్యాలు అద్భుతాలు అన్నారు. పిల్లలకు పాశ్చాత్య భాషలపై మోహన్ని తగ్గించి మన భాషపై మమకారం పెంపొందిస్తే మన బంధాలు, బంధుత్వాలు, విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు వాటంతట అవే నిలబడతాయి అన్నారు.