పార్టీలకతీతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా – ఏడాది కాలంలో రూ. 23 కోట్లతో అభివృద్ధి – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దేలా కృషి చేస్తానని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొంది ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా గౌలిదొడ్డిలోని కార్పొరేటర్ కార్యాలయంలో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గా మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. డివిజన్ ను పార్టీలకతీతంగా, అధికారుల సమన్వయంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఏడాది కాలంలో రూ. 23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా అందులో 80 శాతం వరకు పనులు పూర్తి చేశామని, ఇంకా 20 శాతం పనులు నడుస్తున్నాయని తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నానక్ రాం గూడ లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న లోదా బస్తీ డ్రైనేజీ సమస్యను‌ రూ. 33 లక్షలతో పరిష్కరించామని, నల్లగండ్ల నుండి తెల్లపూర్ వైపు రూ. 55 లక్షలతో వరద నీటి కాలువ పనులు చేశామన్నారు. ఐటీ హబ్ లో చెరువుల సుందరీకరణకు పెద్ద పీట వేశామన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని అన్ని చెరువులను సుందరీకరించి, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వంతో పాటు ప్రయివేటు వ్యక్తుల భాగస్వామ్యం తీసుకుంటామన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకోసం అధికారులకు వినతి పత్రాలు ఇస్తూనే పరిష్కరించుకుంటూ వెళ్తున్నానని చెప్పారు. రాజకీయాలు పక్కన పెట్టి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. గుల్ మోహర్ పార్క్ నేతాజీ నగర్ నుండి వెళ్లే నాలాను వర్ టెక్స్ అనే నిర్మాణ సంస్థ కబ్జా చేసిన విషయాన్ని తెలుసుకుని నాలాను సందర్శించామని, ప్రస్తుతం‌ ఈ సమస్య కోర్టులో ఉందని, భగీరథమ్మ చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేయగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ప్రజల పక్షాన ఉండడానికి, వారి సమస్యలు తీర్చడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తానని, ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గోపన్ పల్లి వడ్డెర సంఘం అధ్యక్షుడు అలకుంట శ్రీరామ్, గచ్చిబౌలి డివిజన్ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు, హరీష్, శంకర్ యాదవ్, కిషన్ గౌలి, నర్సింగ్ నాయక్, ప్రసాద్, ప్రకాష్, మన్నే రమేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న గచ్చిబౌలి ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here