నమస్తే శేరిలింగంపల్లి: పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ వైద్యం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం మియాపూర్ మాతృ శ్రీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హై లైఫ్ 150 పడకల ప్రైవేట్ ఆసుపత్రిని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గాంధీ తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అత్యాధునిక వసతులు, ప్రపంచస్థాయి టెక్నాలజీ పరికరాలు, అనుభవం కలిగిన వైద్య బృందంతో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని యాజమాన్యాన్ని కోరారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల ఆర్థికస్థితిగతులను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ వైద్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యం తో మియాపూర్ ప్రాంతంలో హై లైఫ్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. శివమోహన్ రెడ్డి, మేనేజింగ్ పార్టనర్స్ బి ధర్మారావు, డైరెక్టర్స్ ఎన్.వాణిరెడ్డి, బి.దివ్య, సీఈఓ శ్రీకాంత్ లు అన్నారు. 5ఫ్లోర్స్ లలో 150 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామని వారు తెలిపారు. అన్ని ల్యాబ్ థియేటర్లు, పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు బండి రమేష్, కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం యాదవ్, మిరియాల రాఘవ రావు, గోలి శ్రీనివాస్ నాయుడు, అనిల్ సాంబశివరావు, కిరణ్ యాదవ్, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.