నమస్తే శేరిలింగంపల్లి: వివాహం విషయంలో భర్త తనను మోసం చేశాడని మనస్తాపంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోధన్ లోని అచాన్ పల్లికి చెందిన అన్నపూర్ణ (28) 2010 వ సంవత్సరంలో ఓ వ్యక్తితో వివాహం చేసుకుని పలు కారణాలతో 2014 లో విడాకులు తీసుకుంది. మియాపూర్ లోని న్యూ కాలనీకి చెందిన విజయ్ తో 2016 వ సంవత్సరంలో రెండో వివాహం చేసుకుంది. భర్త విజయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ అన్నపూర్ణ గృహిణిగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త విజయ్ కు గతంలోనే ఇదివరకు వివాహం జరిగిందని అన్నపూర్ణకు తెలిసిపోయింది. ఇదే విషయంపై భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైన అన్నపూర్ణ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి చెల్లెలు సౌందర్య ఫిర్యాదు మేరకు విజయ్ పై కేసు నమోదు చేసినట్లు మియాపూర్ పోలీసులు వెల్లడించారు.