నమస్తే శేరిలింగంపల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేస్ -1 కాలనీలో రూ. 3 లక్షల సీడీపీ ఫండ్స్ ద్వారా సీసీ కెమెరాల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు పంపించిన మంజూరు పత్రాలను జనప్రియ ఫేస్ -1 అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనప్రియ ఫేస్- 1 అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎమ్మెల్యే సీడీపీ ఫండ్స్ ద్వారా రూ. 3 లక్షలు మంజూరు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిధులు మంజూరు కాగానే సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కాలనీలలో నేరాలు అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని, శాంతిభద్రతలను పరిరక్షించడం జరుగుతుందన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వలన కేసులు సులువుగా త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తనవంతు కృషి గా ఎమ్మెల్యే ఫండ్ ద్వారా కోటి రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. తమ కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరిస్తున్న ఎమ్మెల్యే గాంధీకి జనప్రియ ఫేస్ – 1 అసోషియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రవీణ్, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.