నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాప్ ల వల్ల రోడ్ల పై ఏర్పడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను, ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వారి సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలు విధి విధానాల పై ఎక్సైజ్ శాఖ అధికారులతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కొత్త మద్యం పాలసీ విధానంలో మద్యం షాప్ ల కేటాయింపులో రోడ్ల ఆక్రమణ, ట్రాఫిక్ ఇబ్బందులను, ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణాలను కేటాయించాలని సూచించారు. మద్యం దుకాణాల ముందు రోడ్ల ఆక్రమణ, రోడ్డు పై కనీసం అంబులెన్స్ కు కూడా దారి ఇవ్వకుండా వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మద్యం దుకాణాల నిర్వహణపై స్థానికులు తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని వాస్తవ పరిస్థితులను మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ లేఖ ద్వారా తెలియజేశామన్నారు. శేరిలింగంపల్లి, బాలానగర్ ఆబ్కారీ ఇన్స్పెక్టర్లు స్థానిక పరిస్థితులను, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ లో తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని మద్యం దుకాణాల కేటాయించేలా చూడాలని ఆరెకపూడి గాంధీ సూచించారు.
మద్యం దుకాణాల వ్యాపారాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గంలో పార్కింగ్ స్థలం లేని మద్యం దుకాణాలకు లైసెన్స్ ఇవ్వకూడదని ముందుగానే తెలియజేయాలన్నారు. పార్కింగ్ లేకుండా మద్యం అమ్మకాలకు లైసెన్స్ లు కేటాయిస్తే ప్రజల ఇబ్బందులను దృష్ట్యా ఆ దుకాణాలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి మద్యం వ్యాపారుల లాభాన్ని పక్కన పెట్టి ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని లైసెన్సులను కేటాయించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, శేరిలింగంపల్లి ఎక్సైజ్ సీఐ గాంధీ నాయక్, బాలానగర్ ఎక్సైజ్ సీఐ జీవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.