నమస్తే శేరిలింగంపల్లి:కొండాపూర్ డివిజన్ పరిధిలోని జనార్దన్ హిల్స్ కాలనీలోని గ్రీన్ హోమ్ అపార్ట్ మెంట్ వెనుక, ఎన్ సీ సీ అర్బన్ నుండి ప్రేరణ స్కూల్ వరకు సుమారుగా రూ. 3 కోట్ల 23 లక్షల అంచనా వ్యయం తో చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణ పనులను మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూస్తున్నామని అన్నారు. వరద నీటి కాలువ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, వరద నీటి కాలువ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపునకు గురికాకుండా ముందస్తుగా తగిన చర్యలు తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలన్నారు. ఆయన వెంట డీఈ రమేష్, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.