బికె ఎన్‌క్లేవ్ ప్రభుత్వ భూమిని కాపాడాలి: సామాజిక కార్యకర్త సంతోష్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం సిగ్గుచేటని సామాజిక కార్యకర్త తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి పేర్కొన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మ‌క్త మ‌హ‌బూబ్‌పేట్‌ సర్వే నెంబర్ 44 బీకేఎన్ క్లేవ్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆర్ టి ఐ యాక్ట్ కింద చందానగర్ సర్కిల్ 21 ఉపకమిషనర్, శేరిలింగంపల్లి ఎమ్మార్వో కు ఆర్టిఐ యాక్ట్ కింద దరఖాస్తు చేయగా అసలు నిజాలు బయట పడ్డాయని వెల్లడించారు. బికె ఎన్ క్లేవ్ కు సంబంధించిన 44 సర్వే నంబరు మొత్తం ప్రభుత్వ భూమి అని, ఈ స్థలంలో భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతుల్లేవని చెప్పారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం వారే ఎలాంటి అనుమతుల్లేవని చెప్పి బహుళ అంతస్తులను అడ్డుకోకపోవడం దారుణమని సంతోష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో పేద వారు గుడిసె వేసుకుంటే ఆఘమేఘాల మీద వెళ్లి నానా హంగామా చేసే రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది బహుళ అంతస్తుల పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారుల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి గండి పడుతోందని ఎద్దేవా చేశారు. అక్రమార్కుల దగ్గర నుండి లక్షల రూపాయలు లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బికె ఎన్ క్లేవ్ లో జరిగే అక్రమ కట్టడాలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సామాజిక సేవా కార్యకర్త సంతోష్ రెడ్డి
ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here