మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): అహింసా దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్ లోని స్వాతి హైస్కూల్ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి, లాల్ బహుధూర్ శాస్త్రి చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిహెచ్ఎంసి సూపర్ డెంట్ ఇంజినీర్ మోహన్ సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ సత్యం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంతో పోరాడి భారతదేశానికి స్వాతంత్య్రం సంపాదించిన గొప్ప యోధుడు అని అన్నారు.

ప్రపంచంలో రోజు రోజుకి హింసావాదం పెరిగిపోతుందని, దీనితో ప్రాణ, ఆస్థి నష్టంతో పాటు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, దీనికి ఏకైక పరిస్కార మార్గం జాతిపిత మహాత్మా గాంధీ ఆచరించిన అహింసా వాదమే అనిభావించి ఐక్యరాజ్య సమితి వారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినోత్సవం గా ప్రకటించి అమలు చేస్తున్నారని అన్నారు. నేటి యువత మాజీ ప్రధాని లాల్ బహుధూర్ శాస్త్రి, జాతిపిత మహాత్మా గాంధీ జీవితాలను ఆదర్శంగా తీసుకొని నిజాయితీ, నిబద్దత, నిరాడంబరంగా సమస్యల పరిస్కారానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, GHMC EE శివానంద్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఫణికుమార్, సభ్యులు రామ్మోహన్, శివరామకృష్ణ, పాలం శ్రీను, ఎన్ శ్రీనివాస్, ఈరని సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.





