నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవ, పేద ప్రజల ఇబ్బందులను తీర్చడంలో కలిగే తృప్తి మరెందులోనూ లేదని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పేదింటి ఆడపిల్ల వివాహానికి తన వంతుగా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన గుర్ల తిరుమలేష్ కు అమ్మాయి తల్లిదండ్రులతో పాటు చుట్టు పక్కల వారు కృతజ్ఞతలు తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని సిటిజన్ కాలనీలో నివాసం ఉంటున్న తోలాజి బగ్వాన్ కూతురు సనా తోలాజి బగ్వాన్ వివాహం ఈ నెల 17 వ తేదీన ఉండగా వారి కుటుంబ పరిస్థితి తెలుసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్ల తిరుమలేష్ వెంటనే స్పందించి సోమవారం రూ.10 వేల నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలేష్ మాట్లాడుతూ తనకున్నదాంట్లో ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబానికి తనవంతుగా చేతనైనంత సహాయం చేయడం జరుగుతుందన్నారు. పేదింటి ఆడ పిల్లల వివాహం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ లాంటి పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. షాదీ ముబారక్ పథకం సైతం తోలాజి భగ్వాన్ కుటుంబానికి వర్తించేలా చూస్తామని హామినిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ప్రతి పేద వాడి కళ్లల్లో సంతోషం చూడాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ అధిష్టానం మేరకు పనిచేస్తున్నామని గుర్ల తిరుమలేష్ చెప్పారు. తమ కూతురు వివాహానికి ఆర్థిక సహాయం చేసిన తిరుమలేష్ కు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గణేష్ రెడ్డి, మధు కుమార్, ముక్రణ్ తదితరులు పాల్గొన్నారు.