నమస్తే శేరిలింగంపల్లి: గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం, వేమన రెడ్డి కాలనీ, దీప్తిశ్రీ నగర్, శంకర్ నగర్ పలు కాలనీలలో అధికారులతో కలిసి సోమవారం చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పర్యటించారు. నగరంలో ఏడతడిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాలనీలలో రోడ్లు జలమయం కావడంతో రోడ్ల పై ఉన్న వరద నీటిని వెంటనే కాలువల్లోకి మళ్లించాలని, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులకు ఆమె సూచించారు. అంతేకాకుండా మాన్ సూన్ టీమ్స్ ద్వారా కాలనీలలో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలోని కాలనీలు వరద ముంపునకు గురికాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. గులాబ్ తుఫాన్ ప్రభావం తగ్గేంతవరకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, ఏఈ రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, కాలనీ వాసులు రఘునందన్, సుందర్, ప్రవీణ్, కృష్ణ, లక్ష్మి కాంత్ రెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.