పోరాటాల బాటలో అరుణ కిరణాలు పుస్తకం ఆవిష్క‌రణ – క‌మ్యునిస్టుల పోరాట ప్ర‌తిమ‌ను కొనియాడిన కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టు లేనని సిపిఐ సిపిఎం జాతీయ నాయకులు కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని సిఆర్ ఫౌండేషన్‌లో పోరాటాల బాట‌లో అరుణ కిర‌ణాలు పుస్తక ఆవిష్కరణ సమావేశం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీపీఎం, సీపీఐ జాతీయ నాయ‌కులు కె నారాయణ సారంపల్లి మల్లారెడ్డిలు పుస్త‌కాన్ని ఆవిష్క‌రించి ప్ర‌సంగించారు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం నవాబ్, దొరల పాలనకు వ్యతిరేకంగా పేద, కార్మిక, కర్షక, కవులు, కళాకారులు ఏకమై మహత్తరమైన పోరాటాన్ని నిర్వహించారు. ఆనాటి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే ఈ పోరాటం నిర్వహించడం జరిగిందని, ఈ పోరాటానికి కేవలం కమ్యూనిస్టులు మాత్రమే వారసులుగా ఉంటారని మరోసారి గుర్తు చేశారు. పోరాటానికి ఎలాంటి సంబంధం లేని బీజేపీ ప్రభుత్వం కేవలం హిందూ ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యమైన ఘట్టాలు గుండ్రంపల్లి, దొడ్డి కొమరయ్య అమరత్వం, చాకలి ఐలమ్మ పండించిన పంట కోసం తిరుగుబాటు తదితర అంశాలతో పాటు తెలంగాణలోని అనేక ఎకరాల భూమిని దొరల నుండి లాక్కుని పేద ప్రజలకు ఇచ్చిన చరిత్ర ఎర్రజెండాకు మాత్రమే ఉంటుందని తెలిపారు.

పోరాటాల బాటలో అరుణ కిరణాలు పుస్తకం ఆవిష్క‌రిస్తున్న కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డిల‌తో సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐయూ నాయ‌కులు

అనంతరం పోరాటాల బాటలో అరుణ కిరణాలు అనే పుస్తకాన్ని ఎస్సీ సత్యనారాయణ మాజీ తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స‌ల‌ర్‌ పరిచయం చేశారు. నిజాం ఆగడాలను ఎదుర్కొని పోరాటం నిర్వహించిన వీరులు ఎస్‌వీకే ప్రసాద్‌, కోదండరాంరెడ్డి ముందువరుసలో ఉంటారని తెలిపారు. రావి నారాయణరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య ఇతర నాయకులతో కలిసి పనిచేసిన చరిత్ర వీరిదని అన్నారు. హైదరాబాద్ నగర ఉద్యమంలో పని చేయాలని పార్టీ ఆదేశించడంతో హైదరాబాద్ ప్రాంతంలో పార్టీ నిర్మాణం కోసం పోలీసు కేసులు, నిర్బంధాలు, జైలు జీవితం గడిపార‌న్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకుంటూ పేదలపై ధరల భారం మోపుతూ పాలన కొనసాగిస్తున్నార‌ని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతుంటే బిజెపి విధానాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం వంత పాడుతుంద‌న్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్ముతూ భవిష్యత్తులో ప్రభుత్వ కార్యక్రమాలకు భూమిని లేకుండా చేస్తుందని మండిప‌డ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ వీసీ ఆవుల మంజు లత, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజి నరసింహారావు, రఘు పాల్, ఎస్‌వీకే స‌హచరులు సుగుణమ్మ వారి కుమార్తె డాక్ట‌ర్‌ శోభ, ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, జమున, జిలానీ, డాక్ట‌ర్‌ రజిని, పావని, నాయకులు శోభన్, కృష్ణ రామకృష్ణ చందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here