నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ సర్వే నెంబర్ 41/14, ప్లాట్ నెంబర్ 17 ఇజ్జత్ నగర్ వికర్ సెక్షన్ కు సంబంధించిన శ్మశాన వాటిక నాలుగెకరా స్థలాన్ని అధికార పార్టీకి చెందిన నాయకులు నిబంధనలకు విరుద్దంగా వేలం పాట ద్వారా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని మాదాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డి. సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయకులు డి. నగేష్ నాయక్ వాపోయారు. ఈ మేరకు స్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని కోరుతూ శుక్రవారం శేరిలింగంపల్లి తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. వారి వినతికి తహసీల్దారు సానుకూలంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ప్రజలకు ఉపయోగపడే భూములను కాపాడాల్సిన అధికార పార్టీ నాయకులు ఇలా సొమ్ము చేసుకోవాలని చూడడం విడ్డూరమని సురేష్ నాయక్ అన్నారు. ఇలాంటి స్థలాలను సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలకు ఉపయోగపడే భూములను వేలం వేయడానికి ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు.