- రాజు లతాశ్రీలను అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు
- రూ.10 లక్షల విలువైన సొత్తు రికవరి
నమస్తే శేరిలింగంపల్లి: కరోనా విజృంభన సమయంలో ఒక వైపు మానవాత్వం వెళ్లివిరిసింది. కోవిడ్ బాదితులకు అదేవిధంగా కరోనా, లాక్‌డౌన్ల కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు స్వచ్ఛంద సంస్థలు, మానవతా వాదులు, మనసున్న మహరాజులు రకరకాలుగా సహాయ సహకారాలు అందిచడం చూశాం. ఐతే విపత్కర పరిస్థితుల్లో ఎదుటువారికి సహాయం చేయడం పక్కన పెడితే కరోనాతో పోరాడుతున్న రోగులు, ఆ మహమ్మారికి బలైన మృతుల దేహాలపై నుంచి విలువైన ఆభరణాలను దొంగలించిన క్రూరమైన జంటను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన సొత్తును రికవరి చేశారు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్‌రావు, సీసీఎస్ ఏసీపీ శ్యామ్‌బాబు, ఇన్‌స్పెక్టర్ సురేష్‌లు వివరాలు వెళ్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా ధర్మపురి గ్రామానికి చెందిన చింతలపల్లి రాజు(36) తన మొదటి భార్యతో విడిపోయి నగరానికి వచ్చాడు. ఒక కారు కొనుక్కొని ఓలా క్యాబ్స్‌లో నడుపుతూ జీవనం సాగించాడు. 2017లో లతాశ్రీ(39) అనే ఒక మహిళతో పరిచయం ఏర్పడి ఆ తర్వాత ఇరువురు వివాహం చేసుకుని కుకట్‌పల్లి ఎల్లమ్మబండ రాజీవ్ గృహకల్పలో కాపురం పెట్టారు. ఐతే లతాశ్రీ గచ్చిబౌలి టిమ్స్‌లో పేషెంట్ కేర్‌లో విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆమెతో పాటు పనిచేస్తున్న కొందరు సిబ్బందిని జీడిమెట్ల ప్రాంతం నుంచి తన కార్‌లో టిమ్స్ హాస్పిటల్‌కు తీసుకురావడం చేస్తుండేవాడు రాజు. ఈ నేపథ్యంలో రాజు సైతం టిమ్స్‌లో పేషెంట్ కేర్ విధుల్లో జాయిన్ అయ్యాడు.
అప్పటికే జల్సాలకు అలవాటు పడిన రాజు, లతాశ్రీలు దొడ్డిదారిలో డబ్బులు సంపాదించడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టిమ్స్ హాస్పిటల్‌కు వచ్చే కోవిడ్ పేషెంట్లపై కన్నేశారు. అపస్మారక స్థితిలో ఉండే రోగులు, కరోనాతో మృతిచెందిన వారి పార్ధీవ దేహాలపై నుంచి బంగారు, వెండి ఆభరణాలను దొంగలించడం మొదలు పెట్టారు. లతా శ్రీ వార్డు బయట వేచి ఉంటే, రాజు లోపలికి వెళ్లి పని కానిచ్చేవాడు. దొంగలించిన బంగారాన్ని ముత్తుట్ ఫైనాన్స్, అత్తిక గోల్డ్ వారికి అమ్మెయడం, అదేవిధంగా జగద్గీరిగుట్టలోని జగదాంబ జ్యూవేలరీలో తాకట్టు పెట్టేవారు. కాగా టిమ్స్ హాస్పిటల్‌లో తమ బంధువుల ఒంటిపై నుంచి, మృతదేహాల పైనుంచి నగదు మాయమయ్యిందని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో 7 కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులు రాజు, లతాశ్రీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 16 తులాల బంగారం, 80 తులాల వెండి, 1 సామ్‌సంగ్ ఫోన్‌ను స్వాదీనం చేసుకున్నారు. కేసును చేధించడంలో చొరవ చూపిన గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, సీసీఎస్ పోలీసులను డీసీపీ వెంకటేశ్వర్లు అభినందించారు.