నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి దంపతులు గురువారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. శేరిలింగంపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ రామిరెడ్డి పర్యవేక్షణలో కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డికి, ఆయన సతీమణి రూపా గంగాధర్‌రెడ్డిలకు సిబ్బంది కోవీషీల్డ్ టీకా ఇచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ విషయంలో ప్రజలు అపోహలు వీడి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఒకవైపు కోవిడ్ రెండవ దశ విస్తృతంగా కొనసాగుతుండా మరోవైపు తాజాగా ట్రిపుల్ మ్యూటెంట్ ఆనవాళ్లు తెరపైకి వచ్చాయని అన్నారు. ఈ క్రమంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తాత్సారం తగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి విశేషంగా కృషి చేస్తుందని, ప్రధాని మోడి నాయకత్వంలో దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్నాక సైతం జాగ్రత్తలు పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.