నమస్తే శేరిలింగంపల్లి: దేశభక్తిని ఇనుమడింపజేసే
స్వామి వివేకానంద బోధనలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని బిజెపి రాష్ట్ర నేత, గౌతమీ నగర్ కాలనీ చీఫ్ అడ్వైజర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. స్వామి వివేకానంద వర్థంతి సందర్భంగా గౌతమీ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి మాట్లాడుతూ భారతదేశ కీర్తిని దశదిశలా వ్యాపింపజేయడంతో పాటు ఆయన చేసిన ఉద్బోధలు చారిత్రాత్మకంగా నిలిచాయన్నారు. మందలో ఒకడిగా కాకుండా వందలో ఒకడిగా ఉండాలనే వివేకానందుడి మాటలు యువతకు ఉత్తేజాన్నిస్తాయని అన్నారు. యువత స్వామి వివేకానంద చూపిన బాటలో నడిచి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు నూనె సురేందర్, రాంచంద్రారెడ్డి, ఇంజ పర్వత్ రెడ్డి, కె. ఆదిశేషయ్య, నూకల లక్ష్మణ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.