- – డౌన్‌లోడ్స్‌లో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాం దూసుకుపోతోంది. గత 72 గంటల్లోనే కొత్తగా 2.50 కోట్ల మంది కొత్త యూజర్లు టెలిగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ యాప్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 50 కోట్లకు చేరుకుంది. వాట్సాప్ ఇటీవలే తన ప్రైవసీ పాలసీని అప్‌డేట్ చేస్తున్నట్లు ప్రకటించగానే ఆ పాలసీ పట్ల ఆగ్రహంగా ఉన్న వాట్సాప్ యూజర్లు ఆ యాప్‌ను వదిలి టెలిగ్రామ్‌కు మారుతున్నారు. అందువల్లే టెలిగ్రామ్ ఇప్పుడు డౌన్‌లోడ్స్ లో దూసుకుపోతోంది.
వాట్సాప్ ఇటీవలే నూతన ప్రైవసీ పాలసీ అప్‌డేట్‌ను ప్రకటించింది. అందుకు యూజర్లు అంగీకరించాలని లేదంటే తమ వాట్సాప్ అకౌంట్‌ను కోల్పోతారని, ఇందుకు గాను ఫిబ్రవరి 8వ తేదీని గడువుగా నిర్ణయించామని తెలిపింది. అయితే కొత్త పాలసీ ప్రకారం వాట్సాప్ డేటాను తన మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది. ఇదే యూజర్లకు ఆగ్రహం తెప్పించింది. అందులో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ అనే ఫీచర్ ఉన్న తరువాత కూడా ఇలా ప్రైవసీ పాలసీని ప్రకటిస్తే ఇక ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండి ఏమి ప్రయోజనం ? అని చాలా మంది యూజర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే యూజర్ల ఆగ్రహావేశాలకు వాట్సాప్ తలొగ్గక తప్పలేదు. నూతన ప్రైవసీ పాలసీని ప్రకటించాక యూజర్ల నుంచి వచ్చిన స్పందనను చూసి వాట్సాప్ ఆ పాలసీకి మార్పులు చేసింది. తాము యూజర్ల ప్రైవసీని గౌరవిస్తామని, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ కొనసాగుతుందని, యూజర్ల మెసేజ్‌లను తాము చదవమని, అలాగే డేటాను కూడా ఫేస్‌బుక్‌తో పంచుకోబోమని వాట్సాప్ స్పష్టత ఇచ్చింది. అయినప్పటికీ వాట్సాప్‌ను పెద్ద సంఖ్యలో యూజర్లు ప్రస్తుతం అన్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. నిజానికి వాట్సాప్ కన్నా టెలిగ్రామ్‌లోనే ఫీచర్లు అధికంగా ఉన్నాయి. అందువల్ల వాట్సాప్ నుంచి వారు టెలిగ్రామ్ కు మారుతున్నారు. అయితే ఈ ట్రెండ్ ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.