- లోతట్టు ప్రాంతాలు జలమయం
- రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది
- పరిస్థితులను ఆరా తీస్తున్న ప్రజా ప్రతినిధులు
నమస్తే శేరిలింగంపల్లి: గులాబ్ తుఫాన్ కారణంగా శేరిలింగంపల్లిలో భారీ వర్ష కురిసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో అత్యధికంగా 7.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఎప్పటిలోగే రోడ్లపైకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరింది. ముఖ్యంగా మదీనగుడ ప్రధాన రహదారి, చందానగర్ భవానీపురం, దీప్తీ శ్రీనగర్ మెయన్, రోడ్ నెంబర్ 14, మాదాపూర్ శిల్పారామం, సిటీ వైన్స్, నెక్టర్ గార్డెన్స్, లింగంపల్లి రైల్వే బ్రిడ్జీ వద్ద వరద నీరు ముంచెత్తింది. సకాలంలో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు వరద ముంపు ప్రాంతాలను సందర్శించి సత్వర పరిష్కారాల దిశగా సేవలందించారు. ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

శేరిలింగంపల్లిలో నమోదైన వర్షపాతం(మి.మీ)…
హెసీయూ – 78.3
మాదాపూర్ – 75.5
గచ్చిబౌలి – 54.0
ఖాజాగూడ – 48.5
చందానగర్ – 45.3
లింగంపల్లి – 41.0
హఫీజ్‌పేట్ – 31.3
రాయదుర్గం – 18.5



