నమస్తే శేరిలింగంపల్లి: ఒకవైపు కరోనా విలయ తాండవం చేస్తుంటే… మరోవైపు తాజ పరిస్థితులు కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి. చందానగర్‌లోని అనూ ఫర్నీచర్ జంట భవనాల మధ్యలో ఉన్న రహదారిని వారు తాజాగా మూసేశారు. పబ్లిక్ రోడ్‌ని ఎలా మూసి వేస్తారని సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ హాస్పిటల్‌కు వెళ్లాల్సిన రోగులను అడ్డుకుంటూ రహదారిని మూసి వేసిన అనూ ఫర్నిచర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ హ్యూమన్‌రైట్స్ ఆండ్ కన్యూమర్ ప్రొటెక్షన్ సెల్ (హెచ్ఆర్‌సీపీసీ) చైర్మన్ ఠాకూర్ రాజ్‌కుమార్ సింగ్ డిమాండ్ చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ రోగులకు వీలైతే సహకరించాల్సింది పోయి ఆటంకాలు సృష్టించవద్దని, అలాంటి వారు శిక్షార్హులు అని అన్నారు.
అనూ ఫర్నీచర్ యాజమాన్యాన్ని నమస్తే శేరిలింగంపల్లి ప్రశ్నించగా అదే వీధిలో ఉన్న రాజు అలెర్జీ సెంటర్ వారు కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందజేస్తున్నారని, అక్కడికి వచ్చే రోగులు కనీస జాగ్రత్తలు పాటించడం లేదని అను ఫర్నీచర్ యజమాని రమణరెడ్డి పేర్కొన్నారు. ఎడాది కాలంగా హాస్పిటల్ యాజమాన్యానికి ఎంతగానో సహకరిస్తు వస్తున్నామని అన్నారు. కరోన రోగులు ఇష్టారాజ్యంగా పరిసరాల్లో తిరుగుతున్నారని, వారి వల్ల వైరస్ విస్తరించి తమ సిబ్బందితో పాటు వీదిలోని పలువురు కోవిడ్ భారిన పడ్డారని అన్నారు. రాజు అలెర్జీ సెంటర్ యాజమాన్యంతో సహా వీదిలో వారందరి అభిప్రాయం మేరకే రహదారిని తాత్కాలికంగా మూసివేశామని అన్నారు. ఐతే ఈ విషయమై రాజు అలెర్జీ సెంటర్ యజమాని డాక్టర్ రాజు(పల్మనాలజిస్ట్) వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేడు.