నమస్తే శేరిలింగంపల్లి: నూతన సాంకేతికతను ఆకలింపు చేసుకుంటూ యువ ఉద్యోగులు తమ ప్రతిభను మెరుగుపరుచుకుని సంస్థ అభివృద్దికి పాటు పడాలని పోస్టల్ సర్వీసు బోర్డు సభ్యురాలు కె.సంధ్యారాణి అన్నారు. మంగళవారం అబిడ్స్‌లోని డాక్ సదన్‌లో 2020 సంవత్సరానికి తపాలా శాఖలో ఉత్తమ సేవలు అందించిన సంస్థ సిబ్బందికి మేఘదూత్, డాక్‌సేవా, పిఎల్ఐ. ఆర్‌పిఎల్ఐ అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సర్కిల్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్‌తో కలిసి హాజరైన సంధ్యారాణి పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన తపాలా ఉద్యోగులకు అవార్డులను ప్రధానం చేశారు.
గ్రామీణ డాక్ సేవక్ విభాగంలో ఓదేటి యుగంధర్‌రెడ్డి, పోస్ట్‌మెన్ విభాగంలో బి.శేషు, ఎస్‌పిఎం, స్టెనో విభాగంలో ఎస్.ఉదయ్‌కుమార్, జనరల్ లైన్ సూపర్ వైజర్ విభాగంలో ఎపఫ్రోదితు, ఐపి/ఎఎస్‌పి/ జెఈ విభాగంలో శిశుపాల్‌సింగ్, గ్రూప్ ఎ/బి విభాగంలో సుజిత్‌కుమార్ పెన్న, ఉత్తమ మహిళా ఉద్యోగిగా ఎ.సంధ్య లతో పాటు 24 మంది ఉద్యోగులకు పిఎల్ ఐ, ఆర్‌పిఎల్ఐ అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ 2022 సంవత్సరం లోగా యువ ఉద్యోగులు సీనియర్ ఉద్యోగులు రూపొందించిన వ్యవస్థలను మరింత పటిష్టంగా మార్చాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు తమను తాము మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అవార్డులు అందుకున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ పి.వి.ఎస్.రెడ్డి, పోస్టల్ సర్వీస్ డైరక్టర్ ఎస్.వి.రావు, అకౌంట్స్ విభాగం డైరక్టర్ సాయిపల్లవి తదితరులు పాల్గొన్నారు.