జంట సర్కిళ్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కానీ వైనం
నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల మూడు రోజుల నామినేషన్ల పర్వంలో ఒకరోజు ముగిసింది. తొలి రోజు శేరిలింగంపల్లి జంట సర్కిళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేషన్ దాఖలు కాలేదు. బుధవారం సాయంత్రం నాటికీ నామినేషన్లు ఏమీ దాఖలు కాలేదని ఆయా డివిజన్ల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. అయితే పలు పార్టీల అభ్యర్థులకు నామినేషన్ల దరఖాస్తు ఫారాలు మాత్రం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అకస్మాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులంతా నామినేషన్ ప్రక్రియకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో పాటు ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల తుది జాబితా విడుదల కాలేదు. ఈ కారణాల వల్లనే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేయకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండవరోజు నామినేషన్ లు ఓ మోస్తరుగా, చివరి రోజు భారీగా దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.