గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గత 7 సంవత్సరాలుగా ముకేశ్ చారిటబుల్ ట్రస్టు ద్వారా పేద ప్రజలకు నిరంతర సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆర్ఎంపీ పిఎంపి వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎస్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఆదివారం ట్రస్టు ఆధ్వర్యంలో గోపన్ పల్లి లో నిర్వహించిన వైద్య శిబిరంలో స్థానిక పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గోపనపల్లి తండా, డైమండ్ కాలనీ సమీపం లో నివసించే వంద మంది పేద ప్రజలకు, పిల్లలకు బిస్కెట్ పాకెట్స్, పండ్లు, సి విటమిన్, బి-కాంప్లెక్స్ ట్యాబ్లేట్లు, మాస్క్ లు, టూత్ పేస్ట్ లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విపత్తుల సమయంలో మాత్రమే కాకుండా గత 7 సం”ల నుండి నిరంతరం ప్రతి నెల 22. వ తేదీ నాడు సొంత ఖర్చు లతో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. తన కుమారుడు ముకేశ్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో డా. రఫీ, డా, బి.కె. రెడ్డి, డా. రాజు, డా. యాదగిరి, డా. గోవింద్ నాయక్, డా. కుమార్, డా. శివ, డా. యూసఫ్, డా. అనిల్ తదితరులు పాల్గొన్నారు.