నమస్తే శేరిలింగంపల్లి: బ్రాండెడ్ దుస్తుల పేరిట నకిలీ ఉత్పత్తులు అమ్ముతూ పట్టుబడ్డ ఓ వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కాడు ఓ ఎస్సై. ఏకంగా స్టేషన్‌లోనే రూ.20 వేలు లంచంగా స్వీకరించి ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దాడిలో పట్టుబడ్డ నగదును సీజ్ చేసిన అధికారులు ఎస్ఐ నివాసంలో సోదాలు నిర్వహించారు. మియాపూర్ పోలీస్‌స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఏసీబీ రంగారెడ్డి జిల్లా డిఎస్పీ సూర్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
మియాపూర్‌లో షేక్ సలీం అనే వ్యక్తి తన బట్టల దుకాణంలో బ్రాండెడ్ దుస్తుల లోగోతో నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. సదరు సంస్థ ఫిర్యాదుతో సలీంతో పాటు షాపులో పనిచేసే మరో ఉద్యోగిపై వారం రోజుల క్రితం కేసు నమోదైంది. కాగా ఈ కేసులో సలీంకు స్టేషన్ బెయిలు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగి పేరును కేసు నుండి తొలగించేందుకు గానూ మియాపూర్ సెక్టార్ 2 ఎస్ఐ యాదగిరి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. చివరగా రూ.30 వేలకు ఒప్పందం కుదరగా ఈ నెల 3వ తేదీన సలీం రూ.10 వేలను యాదగిరికి అందజేశాడు. మిగిలిన 20 వేల రూపాయలను సలీం మంగళవారం స్టేషన్‌లోనే ఎస్ఐ చేతికి చాటుగా అందించాడు. వెంటనే దాడి చేసిన అనిశా అధికారులు ఎస్ఐ క్యాబిన్‌లో సోదాలు నిర్వహించి లంచంగా తీసుకున్న రూ.20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కెమికల్ టెస్టు నిర్వహించి వ్యాపారి వద్ద తీసుకున్న సొమ్ముగా నిర్ధారించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎస్ఐ యాదగిరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నట్లు డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. కాగా మెదక్ జిల్లా జిన్నారం ప్రాంతానికి చెందిన యాదగిరి ఏడాదిన్నర క్రితం వరకూ మనోహరాబాద్ స్టేషన్‌లో ఎఎస్సైగా విధులు నిర్వహించి పదోన్నతిపై మియాపూర్ స్టేషన్‌కు బదిలీపై వచ్చాడు.