నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ మాదిరిగా శేరిలింగంపల్లి నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు రావాలంటే స్థానిక శాసనసభ్యులు అరేకపూడి గాంధీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ ఆద్వర్యంలో దళితులందరికీ దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చందానగర్ గాంధీ విగ్రహం నుంచి గంగారం అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు జాస్పర్ రాజన్, దుర్గం శ్రీహరి గౌడ్ ల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జరిపేటి జైపాల్, జీ.మహిపాల్ యాదవ్, మన్నే సతీష్ లు ముఖ్యఅతిథులుగా హాజరై టిఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. హుజురాబాద్ దళితులతో సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికీ రూ.10 లక్షల ఆర్ధిక ప్రోత్సాహం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం పై వరాల జల్లు కురిపిస్తూ మిగిలిన నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేందాలంటే స్థానిక శాసనసభ్యులు అరేకపూడి గాంధీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇలియాస్ షరీఫ్, అయాజ్ ఖాన్, జహంగీర్, అజీమ్, దుర్గ దాస్, దుర్గేష్, శ్రీహరి గౌడ్, రాజేష్, సాయి కిశోర్, ఖాజా, మెరాజ్ తదితరులు పాల్గొన్నారు.
