శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దుర్గాబాయ్ మహిళా శిశువికాస కేంద్రం మహిళా ప్రాంగణంలో మహిళా ట్రైనింగ్ సెంటర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. సీతక్క, తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా సంక్షేమ శాఖ సెక్రటరీ సీతారామచంద్రన్, ఉమెన్ కార్పొరేషన్ ఎండి చంద్రకాంత్ రెడ్డి, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఐటి కంపెనీల సిఎస్ఆర్ నిధులను మహిళా శిక్షణ కార్యక్రమాలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే అవకాశాన్ని దుర్గాబాయ్ మహిళ శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణానికి అప్పగిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఉచిత శిక్షణ సౌకర్యాలు అందిస్తున్నందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.






