శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పీజేఆర్ (PJR) స్టేడియం నుంచి 65వ నంబర్ జాతీయ రహదారి (NH-65) వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మహిళలు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కృష్ణారావు దిశానిర్దేశంలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. చందానగర్, హఫీజ్‌పేట్ డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్ రంగా రావు, మిద్దెల మల్లారెడ్డి, పారునంది శ్రీకాంత్, రామకృష్ణ గౌడ్, సంగారెడ్డి, కార్తిక్ రాయల, పొట్ట నరేందర్ యాదవ్, విజయ్ రెడ్డి, అల్లావుద్దీన్, జనార్దన్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల సమయంలో తులం బంగారం ఇస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా, గతంలో అమలైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా నిలిపివేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. పేద కుటుంబాలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం ఎంతో కీలకమని, ఈ పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న మహిళలు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తులం బంగారానికి ఆశపడి కేసీఆర్ ప్రభుత్వాన్ని వదులుకున్నాం అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలవాలంటే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథాతథంగా కొనసాగించాలని కోరారు.

ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు. పథకాలను వెంటనే పునరుద్ధరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న, ప్రకాష్, సలీం, ప్రమోద్, చందర్ రావు, నగేష్ రెడ్డి, శభన, అంజి యాదవ్, శేఖర్ ముదిరాజ్, బాబా, సునీత, అనంత రెడ్డి, మల్లేష్, ఉపేందర్, ముజాహిద్, గిరి తదితర నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.





