శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): వేముకుంట, గౌతమినగర్‌లోని శ్రీ శ్రీ శ్రీ మహాశక్తి లలితా పోచమ్మ దేవాలయంలో నాగ పంచమి వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసం సందర్భంగా నాగ పంచమిని పురస్కరించుకుని భక్తులు పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, నాగదేవతకు పూజలు చేశారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నాగ పంచమి వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం భక్తి వాతావరణంలో ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా దేవాలయ ట్రస్టీలు గుఱ్ఱపు విజయలక్ష్మి, రవీందర్ రావు భక్తులకు నాగ పంచమి శుభాకాంక్షలు తెలిపారు.





