నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని మిత్ర హిల్స్ నుండి మియపూర్ మెట్రో స్టేషన్ వరకు 120 ఫీట్ల రోడ్డులో రూ.7.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారితో ఎన్నో ఆటంకాలు ఎదురైనా ప్రభుత్వ యంత్రాంగం ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తుందన్నారు. ప్రజల భవిష్యత్ అవసరాల దృష్ట్యా రోడ్ల విస్తరణ పనులు చేపట్టడం జరిగిందని, లింక్ రోడ్ల ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ రోడ్ల ఏర్పాటుతో ఇబ్బందులు తీరుతాయని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోకి ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్, ఏఈ రాజీవ్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహాదేవ్, టీఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, కోనేరు ప్రసాద్, పోతుల రాజేందర్, కాశీనాథ్ యాదవ్, అష్రఫ్, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.