హన్మకొండ, సెప్టెంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగ యువత గొంతుకనవుతానని భారత రాష్ట్ర సమితి ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఉత్తర తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ముల్కనూర్ తెలంగాణ అమరవీరుల చౌరస్తా లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక, జాబ్ క్యాలెండర్లు విడుదల కాక, ఒక వేళ నోటిఫికేషన్లు వచ్చినా, పరీక్షలు నిర్వహించినా ఉద్యోగ నియామకాలు పూర్తి కాక నిరుద్యోగులు ఏండ్లు గడుస్తున్నా డీఏ, ఇంక్రిమెంట్స్ తదితర బకాయిలు రాక సమస్యలు తీరక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే తాను నిరుద్యోగులు, ఉద్యోగుల తరపున గళం వినిపించేందుకు కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి శాసనమండలికి వెళ్తానని, 5 ఏళ్ల కాలంలో ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా ఉచితంగా సేవ చేస్తానని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్మిక సంక్షేమ సంఘం నాయకులు జీ రమేష్, ఆషాడపు శ్రీనివాస్, భూమయ్య, సంపత్ శంకర్, సదానందం తదితరులు పాల్గొన్నారు.