- భారీ వర్షాలకు ప్రజల ఇక్కట్లు.. తెరాస పాలకులకు ప్రజల కష్టాలు పట్టవా ?
- జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు
- సీఎం కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావాలని డిమాండ్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా శేరిలింగంపల్లి పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తెరాస ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం సిగ్గు చేటని బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గం కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి విమర్శించారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ వెస్ట్ జోన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పోరెడ్డి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని బస్తీలు, కాలనీలు, అపార్ట్ మెంట్లు మొత్తం నీట మునిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అయినప్పటికీ తెరా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ వరదల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 20 లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ఆరేళ్లలో హైదరాబాద్ లో వందలాది చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని, దీని పర్యవసానమే భారీ వరదలని అన్నారు. దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

బీజేపీ సీనియర్ నాయకుడు మొవ్వా సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆక్రమణలకు గురైన చెరువుల గురించి టీఆర్ఎస్ సర్కారు కనీసం ఆలోచించడం లేదని, అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమార్కులు పేద ప్రజల ఉసురుపోసుకుంటున్నారని, చెరువులను కబ్జా చేసిన గుంటనక్కలెవరో విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరదలను ఎదుర్కొనే కార్యాచరణ కూడా చేపట్టకపోవడం సిగ్గు చేటన్నారు. ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉంటే ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని, ఓ వైపు ప్రజలు వర్షంలో తడిసి ఇబ్బంది పడుతుంటే మరోవైపు సీఎం ధరణి వెబ్ సైట్ లో అధికారులను బెదిరించి నమోదు చేయిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పనీతిరుని ప్రజలంతా గమనిస్తున్నారని, అదే ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు.
భారీ వర్షాల కారణంగా కాలనీలన్నీ మూసీ నదిలా మారాయని, 8వేల కార్లు నీట మునిగాయని, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు కూడా ఇలాగే మునుగుతుందని ఎద్దేవా చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తూట్ పాలిష్ గ్యాంగ్‌ను పంపకుండా సీఎం ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి స్వయంగా కాలనీల్లో పర్యటించాలని, లేకుంటే ప్రజలు తిరగబడతారని అన్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి రూ. 67 వేల కోట్లు ఖర్చు చేశామంటున్న టీఆర్ఎస్ నేతలు అవి ఏమయ్యాయో సమాధానం చెప్పాలన్నారు. వరద బాధితుల కోసం కేంద్రాన్ని రూ.5 వేల కోట్లు అడుగుతున్న కేసీఆర్ హైదరాబాద్ కోసం కేవలం రూ. 5 కోట్లు మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకోవడం దారుణమన్నారు. అన్నీ కేంద్రమే ఇచ్చినప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకున్నారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు నర్రా జయలక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు నాగేశ్వర్ గౌడ్, మనోహర్, రాజశేఖర్, గోవర్ధన్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్, రామ్ రెడ్డి, మాణిక్యరావు, జయరాములు, శ్రీధర్, వినయ్, రాజు, యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ జితేందర్, నాయకులు నరేందర్ ముదిరాజ్, మారం వెంకట్, రాకేష్ దూబే, మహేష్ ముదిరాజ్, వరప్రసాద్, రవి గౌడ్, అజిత్, నారాయణ రెడ్డి, నరేందర్ ముదిరాజ్, సురేష్ మట్ట, జంగయ్య యాదవ్, నాయకురాళ్లు వినయ, లలిత, శోభ దూబే, నాయకులు లక్ష్మణ్ ముదిరాజ్, రెడ్డి ప్రసాద్, ప్రశాంత్ చారి, రామకృష్ణారెడ్డి, మహేష్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, సురేష్ కురుమ, వినోద్, పవన్, బీజేవైఎం చంద్ర మోహన్, విష్ణు, ఆనంద్, శివ కుమార్, క్రాంతి మాదిగ, సిద్దూ, సామ్రాట్ గౌడ్, రాజు, విజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





