హైదర్‌నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన కాలనీలో తెరాస సీనియర్ నాయకుడు అందే నర్సింహులు ఆధ్వర్యంలో టీఎస్‌క్యాబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్ రావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెరాస పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. డిసెంబర్ 1న జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో తెరాస పార్టీ అధిష్టానం బలపర్చిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి నార్నె శ్రీనివాస రావుని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద, బడుగు, బలహీన వర్గాలు నివసిస్తున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కాలనీలు, బస్తీల్లో సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని, టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడం జరిగిందన్నారు. ప్రజలు తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లకు విన్నవించారు.