శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ వరుస ఎన్నికల్లో ఎదుర్కొంటున్న ఓటములను కప్పిపుచ్చుకునేందుకే హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్ పేరుతో సమావేశాలు నిర్వహిస్తోందని బీజేపీ యువమోర్చా జాతీయ నాయకుడు నీరటి చంద్రమోహన్ విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వం, విజన్‌ను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నీరటి చంద్రమోహన్ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తుందో ప్రజలందరికీ తెలుసని అన్నారు. దేశంలో అల్లర్లు సృష్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నవంబర్ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌కు 90 దేశాలను ఆహ్వానించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే శక్తులను ఈ సమావేశాలకు ఆహ్వానించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీకి అసలు ఎలాంటి విజన్ ఉందని, ఆయన నాయకత్వాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం తప్ప ఈ సమావేశాల్లో చర్చించబోయే అంశాలేంటో స్పష్టత లేదని విమర్శించారు. వచ్చే నెలలో వెస్ట్‌మినిస్టర్ సమావేశాలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోందని, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులను మభ్యపెట్టేందుకే ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించిన ఆయన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని ఈ సమావేశాల కోసం ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆయనపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. దేశంలో వరుసగా ఎన్నికల్లో ఓటములు ఎదురవుతున్నా కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో భారత్ సమ్మిట్ నిర్వహించడం సిగ్గుచేటని నీరటి చంద్రమోహన్ మండిపడ్డారు.





