హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్ నగర్ డివిజన్ లో ఉన్న తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సందర్శించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ హైదర్ నగర్ లోని టీఎంఆర్ఐఈఎస్, జూనియర్ కళాశాల తరలింపు విషయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేర ఆయా విద్యాసంస్థలను సందర్శించడం జరిగిందని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన టీఎంఆర్ఐఈఎస్, జూనియర్ కళాశాలలను తరలించడం వల్ల విద్యార్థులపై భారం పెరుగుతుందని, అన్ని సౌకర్యాలతో మైనారిటీలకు నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భవనాన్ని దూర ప్రాంతమైన వేరొక నియోజకవర్గానికి తరలించడం సమంజసం కాదని, ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేశారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అధికారులకు పాఠశాల, జూనియర్ కళాశాలను తరలించవద్దని సూచించారు. నియోజకవర్గంలో మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల నిర్మాణం కోసం స్థలాన్ని గుర్తించడం జరిగిందని త్వరలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్థల కేటాయింపులు జరిపి భవన నిర్మాణం కోసం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ నుండి గెలుపొందిన తెరాస కార్పొరేటర్ అభ్యర్థి నార్నె శ్రీనివాస రావు, మియాపూర్ డివిజన్ నుంచి గెలుపొందిన తెరాస కార్పొరేటర్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.