చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కలిగించి భారతదేశంలో విలీనం చేయించిన సర్దార్ పటేల్ వారసత్వం మనకు అవసరం అని బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. చందానగర్ లోని జనం కోసం కార్యాలయంలో పటేల్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పటేల్ లాంటి నాయకత్వాన్ని ప్రస్తుతం మోడీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పర్యావరణ సెల్ కన్వీనర్ రవీంద్ర ప్రసాద్ దూబే, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ అజిత్ కుమార్ సేనాపతి, రాష్ట్ర సైనిక విభాగం జాయింట్ కన్వీనర్ నాగం రాజశేఖర్, ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి గూడూరి త్రినాథ్ పాల్గొన్నారు.

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ న్యాయవాదిగా, రైతు నాయకుడిగా, మహాత్మా గాంధీ అనుచరుడిగా స్వాత్రంత్య సముపార్జనలో ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం భారతదేశంలోని 565 సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని, ఉక్కు మనిషిగా పేరు గాంచిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ తన వజ్ర సంకల్పంతో భారతదేశంలో విలీనం కాకుండా స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడిన హైదరాబాద్, మైసూర్, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలను భారత యూనియన్ లో విలీనం చేసి సమైక్య భారతావని నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించారని అన్నారు. స్వతంత్ర భారతవని తొలి ఉప ప్రధానిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన గొప్ప మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. నేటి యువత ఆయన పోరాట పటిమను, నీతి, నిజాయితీ, నిబద్ధతను ఆదర్శంగా తీసుకుని నేటి సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారాలకు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు, శివరామకృష్ణ, నల్లగొర్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.






