మాదాపూర్ స‌ర్కిల్‌ను శేరిలింగంప‌ల్లి జోన్‌లో క‌ల‌పాలి: సీపీఎం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 31 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీలో ఇటీవ‌ల నూత‌నంగా ఏర్పాటు చేసిన మాదాపూర్ స‌ర్కిల్‌ని కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో క‌లిపార‌ని, చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌కు మియాపూర్ స‌ర్కిల్‌గా పేరు మార్చార‌ని వెంట‌నే ఈ రెండు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌కు శేరిలింగంప‌ల్లి సీపీఎం కార్య‌ద‌ర్శి సి.శోభ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు గ్రేట‌ర్ క‌మిష‌న‌ర్‌కు ఆయ‌న మెమొరాండం స‌మ‌ర్పించారు. గ‌తంలో ఎన్నో ఏళ్ల నుంచి శేరిలింగంప‌ల్లి మండ‌లం, మున్సిపాలిటీ, జోన్‌లో మాదాపూర్ ఒక భాగంగా ఉంద‌ని అన్నారు. అలాంటి ప్రాంతాన్ని ప్ర‌స్తుతం పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో కూక‌ట్‌ప‌ల్లి జోన్‌లో క‌లిపార‌ని, దీని వ‌ల్ల ప్ర‌జ‌లు అయోమ‌యానికి, గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నార‌ని అన్నారు. క‌నుక మాదాపూర్ స‌ర్కిల్‌ను కూకట్‌ప‌ల్లి జోన్ నుంచి తీసేసి శేరిలింగంప‌ల్లి జోన్‌లో క‌ల‌పాల‌ని అన్నారు. అలాగే ఎన్నో ఏళ్లుగా ఉన్న చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌కు పేరు మార్చి మియాపూర్ స‌ర్కిల్ పేరు పెట్టార‌ని, కానీ స‌ర్కిల్ కార్యాల‌యం మాత్రం చందాన‌గ‌ర్‌లోనే ఉంద‌ని, దీని కార‌ణంగా కూడా ప్ర‌జ‌లు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నార‌ని అన్నారు. క‌నుక చందాన‌గ‌ర్ స‌ర్కిల్‌కు తిరిగి అదే పేరును కొన‌సాగించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో సీపీఎం జోన్ కార్య‌వ‌ర్గ సభ్యులు వి.మాణిక్యం, కె.కృష్ణ‌, ఎన్‌.వ‌రుణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here