శేరిలింగంపల్లి, జనవరి 27 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు, ఎఐటియుసి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ కి సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సిఐటియు కార్యదర్శి కొంగరి కృష్ణ, ఏఐటియుసి కార్యదర్శి చందు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో జిహెచ్ఎంసి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మె జయప్రదం చేయాలని కోరారు. అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిహెచ్ఎంసి కార్మికులకు సమ్మెలో పాల్గొనాలని అన్నారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 44 గా ఉన్న కార్మిక చట్టాలకు బదులుగా నాలుగు లేబర్ కోడ్ లు తీసుకురావడం జరిగిందని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాల ఏకమై సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని తెలిపారు. సమ్మెలో కార్మికులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరావు, కొండలు, శీను తదితరులు పాల్గొన్నారు.

శంషాబాద్‌లో..
నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు, సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జి కవిత పిలుపునిచ్చారు. మంగళవారం శంషాబాద్ మండల కేంద్రంలోని హోటల్ ఎలైట్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని అఖిలభారత కార్మిక సంఘాలు అన్ని కలిసి ఐక్యంగా ఈ సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 12న తుక్కుగూడలో కార్మిక సంఘాల జిల్లా సదస్సు లక్ష్మీ గార్డెన్‌లో జరుగుతుందని ఈ సదస్సుకు కార్మికులు పెద్ద ఎత్తున హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు కే రంగస్వామి, సిఐటియు జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి దత్తు నాయక్, సిపిఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రగిరి పాల్గొన్నారు.





