సంఘటన్ సృజన్ అభియాన్‌తో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని, ప్రతి బూత్‌ను బలోపేతం చేసి పార్టీని మరింత పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఉందని కర్ణాటక రాష్ట్ర గౌర‌వ్ ఎమ్మెల్సీ, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎన్నికల అబ్జర్వర్ సీవీ మోహన్ అన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ కేవలం కార్యక్రమం కాదని, కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే సంస్థాగత నిర్మాణ ప్రక్రియ అని పేర్కొన్నారు. మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ఎంఎస్పీ కన్వెన్షన్‌లో జిల్లా అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి అధ్యక్షతన, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీవీ మోహన్ హాజరయ్యారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాధమయి, చైర్మన్లు రామ్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డితో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీవీ మోహన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్ర, సిద్ధాంతం, ప్రజలతో దశాబ్దాల అనుబంధం ఉన్నాయని అన్నారు. ఈ బలాన్ని ఎన్నికల విజయంగా మార్చాలంటే బలమైన సంస్థాగత వ్యవస్థ, చురుకైన కార్యకర్తలు, ప్రతి బూత్‌లో సమర్థవంతమైన నాయకత్వం అవసరమని చెప్పారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల సమస్యలను వినడం, వారికి గౌరవం ఇవ్వడం, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం నాయకత్వ బాధ్యత అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో బూత్ కమిటీలను బలోపేతం చేయడంతోపాటు ప్రతి బూత్‌లో క్రియాశీల కార్యకర్తలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో మరింత ప్రాధాన్యం కల్పించాలని కోరారు. పార్టీ ప్రయోజనం ముందు వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఉండకూడదని, వ్యక్తి కంటే పార్టీ, పదవి కంటే కార్యకర్త, రాజకీయ ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమని పేర్కొన్నారు.

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలమని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రతి బూత్‌ను కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా మార్చేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తను కలుపుదాం.. ప్రతి బూత్‌ను బలోపేతం చేద్దాం.. ప్రతి ఇంటికి కాంగ్రెస్‌ను తీసుకెళ్దాం అనే లక్ష్యంతో సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా క్రమశిక్షణతో కూడిన, ప్రజలకు అందుబాటులో ఉండే బలమైన సంస్థగా కాంగ్రెస్‌ను నిర్మించాలని నేతలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ఇన్‌చార్జులు, మైనారిటీ నాయకులు, లేబర్ సెల్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here