శేరిలింగంపల్లిలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 241-మక్తా మహబూబ్‌పేట్‌ డివిజన్‌లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) జెండా పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న జెండా పండుగలో భాగంగా డివిజన్‌లో మూడో జెండాను ఏర్పాటు చేశారు. తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వాసిలి చంద్రశేఖర్‌ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డివిజన్‌ అధ్యక్షుడు గుండె దయానంద్‌ ముదిరాజ్‌ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం మక్తా మహబూబ్‌పేట్‌ చౌరస్తాలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్‌ ప్రసాద్‌ తెలంగాణ రక్షణ సేన జెండాను ఆవిష్కరించారు. సభలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న పాంచజన్యం, సామాజిక న్యాయం ఆధారంగా తెలంగాణ నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించారు.

రాబోయే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన విజయం సాధించడం ఖాయమని వాసిలి చంద్రశేఖర్‌ ప్రసాద్‌ ధీమా వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కవిత తెలంగాణకు తొలి మహిళా ముఖ్యమంత్రి కావడం కూడా ఖాయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సామాజిక న్యాయంతో కూడిన పాలన అందించడమే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో మక్తా మహబూబ్‌పేట్‌ డివిజన్‌ అధ్యక్షుడు గుండె దయానంద్‌ ముదిరాజ్‌తో పాటు లావణ్య, షేక్‌ అస్లాం, సందీప్‌, కుమార్‌ కూర్మ, విష్ణుచారి, మురుగేసాన్‌, ప్రభు, ప్రభు ముదిరాజ్‌, లక్ష్మి, మాధవి, ప్రవీణ్‌, రఘు, మనోజ్‌, షేక్‌ వలి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here