భవిష్యత్తు సమాజ నిర్దేశకుడు గురువు

– కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్. ఎస్ . సర్రాజు

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని విద్యానికేతన్ మోడల్హై స్కూల్ నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో పర్వతనేని గంగాధర్ గారి సౌజన్యంతో గురుపూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఆర్. ఎస్ . సర్రాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.

గురుపూజ మహోత్సవ కార్యక్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య ఆర్. ఎస్ . సర్రాజుగారికి సన్మానం

 

మియాపూర్ సబ్ డివిజన్ ఏ సీ పీ కృష్ణప్రసాద్, జవహర్ నవోదయ ప్రిన్సిపాల్ కృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డిగ్రీ, జూనియర్ కళాశాలల, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన అధ్యాపకులు 40 మందికి వేదమంత్రోచ్ఛారణల మధ్య, సన్నాయి వాయిద్య ఘోషలతో, జ్ఞాపిక శాలువా పగిడి తాంబూలాలతో సాంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా సత్కరించారు . అనంతరం సర్రాజు మాట్లాడుతూ, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువులకు పెద్దపీట వేసింది మన భారతీయ సనాతన సంస్కృతి అన్నారు. గురువులు భావి భారత పౌరులైన విద్యార్థినీ విద్యార్థులలోని అజ్ఞానాన్ని విజ్ఞానంతో తొలగించి, జీ విత విలువలు తెలిపి, బాధ్యతాయుత వ్యక్తులుగా, వారి బంగారు భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులుగా, ప్రగతి రథసారథులుగా, నిలిపి వారి సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయాలన్నారు. భవిష్యత్తు సమాజ నిర్దేశకుడు గురువు. అందుకే అధ్యాపక వృత్తి మనసా, వాచా, కర్మణా పవిత్రంగా నిర్వహించాలన్నారు. ఆది యుగము నుండి, నేటి ఆధునిక యుగం వరకు మన జీవన వికాసానికి నిచ్చెన వేసే, అక్షర కార్మికుడు గురువు. మన సమాజమనే దేవాలయానికి నిజమైన రక్షకుడు గురువే అన్నారు. ఈ సమాజంలో కులమత ప్రాంతాలకు అతీతంగా గౌరవించే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకనే

గురుర్బ్రహ్మ గురు ర్విష్ణు గురు దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః* ” అని

మన పూర్వీకులు గురువును గూర్చి స్తుతించారు. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశ్లేషిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. ఈ కోవకు చెందిన వారే శ్రీకృష్ణ పరమాత్ముడు, దక్షిణామూర్తి, ఆగస్త్యుడు, విశ్వామిత్రుడు, సాందీపుడు, పరుశురాముడు, ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస మొదలగువారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కళాశాల అధ్యాపకుడిగా, ఫిలాసఫీ ఆచార్యుడుగా, ఉపకులపతిగా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విజిటింగ్ ఆచార్యులుగా, రాయబారిగా, ఎడ్యుకేషన్ కమిషన్ అధ్యక్షుడిగా, సోవియట్ యూనియన్ రాయబారిగా, భారత ఉపరాష్ట్రపతిగా, భారత రెండవ రాష్ట్రపతిగా, పనిచేసి ఆయా పదవులకు వన్నె తెచ్చి, మనందరికీ మార్గదర్శకులయ్యారు. ఆయన గొప్ప మేధావి. గొప్ప తత్వవేత్త. భారతీయ తత్వశాస్త్రాన్ని ప్రపంచ పటమున నిలిపిన అపర మేధావి. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో, ఆయన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు. ఆయనను 1954లో భారతరత్న బిరుదుతో భారత ప్రభుత్వం సత్కరించింది. వారి గౌరవార్ధం 1962 నుండి ఆయన జన్మదిన సెప్టెంబర్ 5వ తారీఖున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్కరించడం జరుగుతుంది. నేటి అధ్యాపకులు సమాజంలో వస్తున్న మార్పులను క్షేత్రస్థాయిలో నిశితంగా గమనిస్తూ , నూతన విద్యా విధానంలో మార్పులను ఆకలింపు చేసుకుని, నిత్య అధ్యయనం చేస్తూ సమాజంలో అధ్యాపక వృత్తికి ఉన్న విశిష్టతను దృష్టిలో ఉంచుకొని , భావి భారత పౌరులకు విలువలతో కూడిన గుణాత్మక విద్యను అందించి, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దవలసిన సామాజిక బాధ్యత అధ్యాపకులదే అని తెలిపారు. కార్యక్రమంలో పర్వతనేని గంగాధర్, విద్యా గు నికేతన్ మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ రామాచారి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వి.ఫణికుమార్, విష్ణుప్రసాద్, శివరామకృష్ణ, ఉమా చంద్రశేఖర్, విజయలక్ష్మి ,పాలం శ్రీను, జనార్దన్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here